కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తా: కల్వకుంట్ల కవిత

కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తా: కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, ఏప్రిల్ 03 (గోల్కొండ ) : తాను స్థాపించ బోయే పార్టీకి పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. తమకు ప్రధాన శత్రువు అధికార కాంగ్రెస్ పార్టీనే అని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో కల్వకుంట్ల కవిత ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తమ పార్టీ ప్రొ. జయశంకర్ సిద్ధాంతాల ప్రకారమే నడుస్తుందన్నారు. తమ పార్టీకి బిహార్ సిద్ధాంతకర్త ఎవరూ లేరన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రస్తుతం నిద్రావస్థలో ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరు ఖాళీగా ఉందని.. దానిని ఎవరైనా వాడుకోవచ్చునని చెప్పారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా ఒక టీమ్ పని చేస్తోందన్నారు. పార్టీ ఆవిర్భావం రోజు.. అమరవీరుల స్తూపం వద్దకు వెళ్తామని పేర్కొన్నారు. గుంపు మేస్త్రీ గుంట నక్కలు దోస్తులంటూ సీఎం రేవంత్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై కవిత పరోక్ష విమర్శలు చేశారు.
సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గం మహిళా రిజర్వేషన్‌గా చేస్తే.. ఆ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగుతానన్నారు. గజ్వేల్ మహిళా రిజర్వేషన్ వచ్చినా పోటీ చేసే అంశాన్ని ఆలోచిస్తానని తెలిపారు. సీఎం రేవంత్.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసి ఆ పార్టీని ఓడించారని.. అలాగే ప్రస్తుతం కేరళలో ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని ఓడిస్తారని వ్యంగ్యంగా అన్నారు. రేవంత్ రెడ్డి ప్యూచర్ సిటీ అంటున్నారని.. కానీ అసలు సిటీని చంపకుంటే చాలని చురకలంటించారు.ప్రైవేట్ స్కూల్స్ దోపిడీని కంట్రోల్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే స్కూల్స్ ముందు ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ‘అన్ని శాఖలకు ముఖ్యమంత్రే మంత్రిగా ఉండటం మన కర్మ’ అంటూ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో తనను నిజామాబాద్‌కు పరిమితం చేశారని అన్నారు. ఆంధ్రా, నార్త్ ఇండియా వాళ్ళు ఇక్కడ విద్యా సంస్థలు నెలకొల్పినా తెలంగాణ వాళ్ళకే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఫీజులను పెంచుతున్నాయే తప్ప టీచర్లకు మాత్రం జీతాలు పెంచరని విమర్శించారు. ప్రైవేట్ కాలేజీల్లో ఆహార నాణ్యతను ప్రభుత్వం పట్టించుకోదా అని ప్రశ్నించారు. ప్రైవేట్ పాఠశాలలు, ఆసుపత్రులను సీఎం ప్రారంభిస్తున్నారని… వాళ్ళ దోపిడిని ఎంకరేజ్ చేస్తున్నారా అంటూ నిలదీశారు.రాష్ట్రంలో 39,640 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. వీటిలో 12,061 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయన్నారు. సీబీఎస్సీ సెంట్రల్ సిలబస్ ఉన్న స్కూల్స్‌లో 25 నుంచి 30 శాతం ఫీజులు పెంచి ఇప్పటి నుంచే వసూలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఫీజు నియంత్రణ చట్టం చేయాలని రేవంత్ రెడ్డి పదే పదే మాట్లాడారని గుర్తుచేశారు. ఎవరెంత తిన్నారంటూ అసెంబ్లీలో చర్చ చేసుకున్నారే తప్ప ఫీజుల నియంత్రణపై మాట్లాడలేదని విమర్శించారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!