
హైడ్రా అధికారిగా ఎవరిని నియమించాలనే విచక్షణ ప్రభుత్వానికి ఉంది: సీఎం రేవంత్
న్యూఢిల్లీ జులై 28 🙁 గోల్కొండ)
హైడ్రా పనులు కొనసాగించి తీరుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కబ్జా కోర్లు హైడ్రా వద్దంటున్నారని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. కబ్జాలు చేస్తే బడా బాబులైనా, పేదలైనా ఊరుకోమని స్పష్టం చేశారు. గండిపేట బతుకమ్మ కుంటలను ఆక్రమించింది పేదలా? పెద్దలా? అని విపక్షాలను ఆయన ప్రశ్నించారు. ఎన్ కన్వెన్షన్ పేదలదా? పెద్దలదా? అని వారిని నిలదీశారు.
హైడ్రా తాము తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణగా సీఎం అభివర్ణించారు. హైడ్రాకు ఉన్నతాధికారిగా ఎవరిని నియమించాలనే విచక్షణ తమ ప్రభుత్వానికి ఉందని కుండబద్దలు కొట్టారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్‌పైన 400 పైగా కోర్టు ధిక్కరణ కేసులున్నాయని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.దురుద్దేశంతోనే కేసులు వేసి కోర్టును తప్పుదోవ పట్టించారంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. కోర్టు తీర్పుని పరిశీలించి.. ఆ తర్వాత తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. హైడ్రా కార్యాచరణ పైన తమకు పూర్తి స్పష్టత ఉందని అన్నారు. కబ్జాకోరులకు సహకరించొద్దంటూ మీడియాకు సూచించారు. డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


