బిహార్‌లో ముగిసిన నితీష్ యుగం.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమ్రాట్ చౌదరి

బిహార్‌లో ముగిసిన నితీష్ యుగం.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమ్రాట్ చౌదరి

పాట్నా ఏప్రిల్ 15 (గోల్కొండ ):బిహార్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగిసింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించిన నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయడంతో, భారతీయ జనతా పార్టీ కి చెందిన బలమైన నేత సమ్రాట్ చౌదరి బుధవారం బిహార్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని లోక్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ఘనవిజయం సాధించిన తర్వాత, నితీష్ కుమార్ రికార్డు స్థాయిలో 10వ సారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే, అనూహ్య పరిణామాల మధ్య ఆయన క్రియాశీల రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకుని రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో బిహార్‌లో నితీష్ కుమార్ యుగం ముగిసి, బీజేపీ నేతృత్వంలోని సరికొత్త అధ్యాయం మొదలైంది. బిహార్‌కు బీజేపీ నుంచి ముఖ్యమంత్రి కావడం ఇదే తొలిసారి.
బిహార్‌లో వెనుకబడిన తరగతుల , ముఖ్యంగా కోయిరీ/కుష్వాహ సామాజిక వర్గాల్లో సమ్రాట్ చౌదరికి మంచి పట్టు ఉంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
57 ఏళ్ల సమ్రాట్ చౌదరి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి శకుని చౌదరి ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తల్లి పార్వతీ దేవి కూడా ఎమ్మెల్యేగా సేవలందించారు. 1990లలో ఆర్జేడీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన సామ్రాట్, 2018లో బీజేపీలో చేరారు. 2023లో బీహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, 2024లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. నితీష్ కుమార్‌ను అధికారం నుంచి దించే వరకు తాను తలపాగా (మురేథా) తీయనని 2022లో ఆయన బహిరంగంగా శపథం చేశారు. నేడు నితీష్ స్థానంలో ఆయనే ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడం గమనార్హం.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!