
బెంగాల్ ఎన్నికలు… మమతా బెనర్జీ నామినేషన్
ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 08 గోల్కొండ: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్ నుంచి టీఎంసీ అభ్యర్థిగా బుధవారంనాడు నామినేషన్ వేశారు. పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు ఆమె వెంట హాజరయ్యారు. నామినేషన్ వేయడానికి ముందు ఖాళీఘాట్‌లోని తన నివాసం నుంచి అలీపోర్ సర్వే బిల్టింగ్ వరకూ మమతాబెనర్జీ రోడ్‌షో నిర్వహించారు. ఆమె మద్దతుదారులు పెద్దఎత్తున ఈ రోడ్‌షోలో పాల్గొన్నారు. రోడ్డుకు ఇరువైపులా నిలబడిన ప్రజలకు అభివాదం చేస్తూ ఆమె ముందుకు కదిలారు.
నా జీవితం ఇక్కడి నుంచే మొదలైంది..
నామినేషన్ పత్రాల సమర్పణ అనంతరం మమతా బెనర్జీ మాట్లాడుతూ, తాను పుట్టింది, పెరిగింది భవానీపూర్‌లోనేనని, తన జీవితంలో ప్రతీదీ ఇక్కడి నుంచే ప్రారంభమైందని చెప్పారు. భవనాపూర్‌లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు టీఎంసీకి ఓటు వేయాలని కోరారు. 294 సీట్లలోనూ పార్టీ అభ్యర్థులను గెలిపించి అతిపెద్ద విజయాన్ని చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల జాబితాలో అనేక మంది పేర్లను తొలగించడం తనకు బాధ కలిగిస్తోందని, ఓటర్ల తుది జాబితా ఇంకా ఎందుకు విడుదల చేయలేదో అర్థం కావడం లేదని అన్నారు. దీనికి వ్యతిరేకంగా మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.
మమత వెర్సస్ సువేందు
భవానీపూర్ నియోజవర్గం నుంచి మమతా బెనర్జీ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నాలుగోసారి పోటీలో ఉన్న మమతా బెనర్జీపై బీజేపీ తమ అభ్యర్థిగా సువేందు అధికారిని పోటీలోకి దింపింది. 294 మంది సభ్యుల పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి రెండు విడతలుగా ఏప్రిల్ 23, 29 తేదీల్లో పోలింగ్ జరుగనుంది. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.


