
టీ-ఫైబర్ పనులు పై ముఖ్యమంత్రి సమీక్ష
హైదరాబాద్ ఆగస్టు 18 ( గోల్కొండ ): టీ-ఫైబర్ పనులు జరిగిన తీరు, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్లో చేపట్టనున్న పనులపై సమగ్రమైన నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టీ ఫైబర్ పనులు చేసిన కాంట్రాక్ట్ సంస్థలకు నోటీసులు ఇచ్చి పనులు చేసిన తీరుపై నివేదిక కోరాలని సీఎం ఆదేశించారు.టీ ఫైబర్ పై తన నివాసంలో ముఖ్యమంత్రి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కలిసి సమీక్ష నిర్వహించారు. సంస్థలో ఉద్యోగుల సంఖ్య, వారి పని తీరును సమీక్షించాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఉద్దేశించిన కార్యక్రమమైనందున పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కొరారు .టీ ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రణాళిక ఉండాలని చెప్పారు. ఇప్పటి వరకు చేసిన వ్యయం, పూర్తి కావడానికి అవసరమయ్యే నిధులు, వాటి సేకరణ, కార్యక్రమం విజయవంతం కావడానికి తీసుకోవాల్సిన చర్యలను నివేదికలో పొందుపర్చాలని ముఖ్యమంత్రి సూచించారు.ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


