
పాటలు తప్ప.. స్కామ్‌లు తెలియవు : సింగర్ మంగ్లీ
హైదరాబాద్ ఏప్రిల్ 15 (గోల్కొండ ):తనపై వస్తున్న ఆరోపణల కారణంగా చాలా నగిలిపోతున్నానని, తనకు పాటలు తప్ప.. స్కామ్‌లు తెలియవని సింగర్ మంగ్లీ అన్నారు. విచారణ చేసుకోవాలని.. తాను తప్పు చేసి ఉంటే ఎలాంటి శిక్షకైనా రెడీగా ఉన్నానని చెప్పారు. బుధవారం మంగ్లీ మీడియాతో మాట్లాడుతూ.. ‘పేదరికం నుంచి వచ్చాను. డబ్బు విలువ నాకు తెలుసు. నెల రోజులుగా నా ప్రోగ్రామ్‌లు, రికార్డింగ్స్ వదులుకున్నా. ప్రజల్లోకి తప్పుగా వెళ్తోంది. బాధితులకు నేను అండగా ఉంటా. మధు నాయక్, హిమాకాంత్ రెడ్డి, రామావత్ మధు, సిద్ధు, సుబ్బారావుపై డీజీపీకి ఫిర్యాదు చేశాను’ అని అన్నారు.
మంగ్లీ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘నేరగాళ్లే బాధితుల రూపంలో పోలీస్ స్టేషన్‌కి వస్తున్నారు. అసలు స్కామ్ చేసిన వాళ్లే మీడియా ముందుకు వచ్చి బాధితులుగా మాట్లాడుతున్నారు. సుభాక్షేత్ర బిజినెస్ అనే పేరుతో కంపెనీ ఏర్పాటు చేసి.. దానికి ఎండీగా ఉన్నది మధు. ప్రస్తుతం బాధితుడిగా మీడియాతో మాట్లాడుతున్న హిమాకాంత్ రెడ్డి ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నాడు. ఈ స్కామ్‌కి మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదు’ అని అన్నారు.


