
మంగ్లీపై కేసు.. 150 కోట్ల నుంచి రూ.200 కోట్ల మేర వసూళ్లు
హైదరాబాద్ క్రైమ్ ఏప్రిల్ 11 (గోల్కొండ ):తెలుగు రాష్ట్రాల్లో సింగర్ మంగ్లీపై కేసు నమోదు కావడం సంచలనం సృష్టిస్తోంది. పెట్టుబడుల పేరుతో సుమారు 100 మందిని మోసం చేయడం, బాధితుల తరఫు న్యాయవాదిపై బెదిరింపులకు పాల్పడడంపై కేసు నమోదు అయ్యింది. బాధితుల నుంచి సుమారు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల మేర వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మంగ్లీ, ఆమె సోదరుడు శివ, మరికొంతమందిపై కేసు నమోదు అయ్యింది. ఈ సందర్భంగా బాధితుల తరఫు న్యాయవాదితో మాట్లాడగా ఈ కేసుకు సంబంధించి ఆయన సంచలన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా అడ్వకేట్ సుబ్బారావు మాట్లాడుతూ.. ‘రెండు నెలల కిందట సింగర్ మంగ్లీ పేరుతో తమను మోసం చేశారని కొంతమంది బాధితులు మమ్మల్ని కలిశారు. మేము విచారణ చేపట్టగా ఈ మోసంలో మంగ్లీతోపాటు ఆమె సోదరుడు శివ, మధు అనే వ్యక్తి ఉన్నట్టు తేలింది. బాధితులు చెప్పిన వివరాల ప్రకారం సింగర్ మంగ్లీని కలిశాను. ఆమె చాలా అహంకారంతో మాట్లాడారు. ప్రధాన నిందితుడు మధు ముందు వరుసలో ఉండి రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్లు వరకూ పెట్టుబడుల రూపంలో సేకరించారు. రియల్ ఎస్టేట్‌తోపాటు ఇతర రంగాల్లో ఈ పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు ఇస్తామని బాధితుల నుంచి నగదు వసూలు చేశారు. లాభాలతోపాటు పెట్టిన పెట్టుబడి కూడా ఇవ్వకపోవడంతో వారంతా మమ్మల్ని ఆశ్రయించారు.22 రోజుల కిందట ఫిర్యాదు చేస్తే తాజాగా ఎఫ్ఐఆర్ నమోదైంది. వట్టిపల్లి తండాలో సుమారుగా 200 మంది దాకా బాధితులు ఉన్నారు. వీరి వద్ద నుంచి రూ.200 కోట్లు వసూలు చేశారు.రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలోనూ వారి బాధితులు ఉన్నారు. మంగ్లీ పేరు చెబితేనే తామంతా మధుకి డబ్బులు ఇచ్చామని బాధితులు చెబుతున్నారు. కోకాపేట్లో పబ్బు, హాస్పిటల్, స్కూల్, సిమెంట్ ఫ్యాక్టరీలు కడుతున్నామని చెప్పి అమాయకుల నుంచి కోట్లు వసూలు చేశారు. గోకులనందన ఇన్ఫ్రా అనే సంస్థలో పెట్టుబడులు తీసుకున్నారు. అధిక లాభాలు ఇస్తారని నమ్మి చిన్న, మధ్య తరగతి వాళ్లంతా పెట్టుబడి పెట్టి మోసపోయారు’ అని తెలిపారు.


