జీహెచ్ఎంసీ అంటే గుంపు మేస్త్రి పాలన.. కవిత సంచలన వ్యాఖ్యలు

జీహెచ్ఎంసీ అంటే గుంపు మేస్త్రి పాలన.. కవిత సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, ఏప్రిల్ 10 (గోల్కొండ ) : జీహెచ్ఎంసీలో తీవ్ర అవినీతి జరుగుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అనేక గ్రామాలు జీహెచ్ఎంసీ పరిధిలో కలిసినా సరైన అభివృద్ధి జరగడం లేదని విమర్శించారు. హెచ్ఎండీఏ పరిధిలో 35 వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టారని తెలిపారు. ఆ మొత్తాన్ని హైదరాబాద్ అభివృద్ధికి ఉపయోగించలేదని కవిత ఆరోపించారు. హెచ్ఎండీఏకు చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని గుర్తు చేశారు.

నర్సరీ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న 6 వేల మంది స్కిల్డ్ లేబర్‌కు 23,800 రూపాయలు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ఒక కంపెనీపై సీఎం రేవంత్ రెడ్డి సిట్ వేయించారని.. తర్వాత ఏమైందో తెలియాలని ప్రశ్నించారు. ఔటర్ రింగ్ రోడ్డులో గత ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టును రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని విమర్శించారు. ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌పై ముఖ్యమంత్రి దృష్టి పెడుతున్నారని.. సీఎం దగ్గర బ్యాగులు మోసే వ్యక్తి చెప్పినట్టు మాత్రమే పనులు జరుగుతున్నాయని కవిత ఆరోపించారు. జీహెచ్ఎంసీ అంటే గుంపు మేస్త్రి పాలనలో జరుగుతున్న మహా అవినీతి అని వ్యాఖ్యానించారు. అవినీతి కోసమే సీఎం ‘ఫ్యూచర్ సిటీ’ అంటున్నారు.
2017 నుంచి 2021 వరకు 480 కోట్ల రూపాయల పనులను నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు ఇచ్చారని కవిత తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మరో 1,140 కోట్ల రూపాయలను అదే పద్ధతిలో కాంట్రాక్టులు ఇచ్చారని వెల్లడించారు. ఇది ఆర్థిక శాఖ నిబంధనలకు వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. రూ.50 కోట్ల టెండర్ వేస్తే దాదాపు 50 శాతం తిరిగి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని.. కానీ నామినేషన్ పద్ధతిలో ఇలాంటి లాభం లేకపోవడం అవినీతికి దారితీస్తోందని ఆరోపించారు.
ఈ నెల 25వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 21 కమిటీలు వేశామని కవిత చెప్పారు. 500 మంది వలంటీర్లు సేవలు అందిస్తారని తెలిపారు. మహిళా బిల్లు అమలు కాకపోవడంతో 12 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు నష్టపోయారని చెప్పారు. 2027 జనగణన తర్వాత మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. ధర్మపురి అరవింద్‌లో పురుష అహంకారం కనిపిస్తోందని.. ప్రజలు ఆయన్ను ఎప్పుడో మర్చిపోయారని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాను… ఎవరో చెప్తే పార్టీ పెట్టే స్థాయిలో లేను’ అని కవిత స్పష్టం చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు రిపేర్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నానమని అన్నారు. అయితే, కమీషన్ల కోసమే రిపేర్ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను కేరళం ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని తాము వీడియో రిలీజ్ చేశామని పేర్కొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!