
విజయ్‌కు చేరువయ్యేందుకు బీజేపీ పావులు…
తమిళనాడు లో మారనున్న సమీకరణాలు …
న్యూఢిల్లీ అక్టోబర్ 05 (గోల్కొండ ):తమిళనాడులోని కరూర్‌లో టీవీకే చీఫ్ విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట అనంతర నేపథ్యంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నట్టు కనిపిస్తోంది. విజయ్ పార్టీ టీవీకే కు చేరువయ్యేంతకు బీజేపీ పావులు కదుపుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. విజయ్‌కు ఉన్న విస్తృతమైన అభిమానుల ఫాలోయింగ్‌ను 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించుకునే ఆలోచనలో బీజేపీ ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా విజయ్‌ను డీఎంకే అన్యాయంగా టార్గెట్ చేసినప్పటికీ అతను ఒంటరి అయినట్టు కాదని బీజేపీ సీనియర్ నేత ఒకరు టీవీకే నాయకత్వానికి సంకేతాలు పంపారని తెలుస్తోంది. డీఎంకేను అన్నిరకాలుగా కార్నర్ చేయాలని తాము కూడా కోరుకుంటున్నందున విజయ్‌ను సహనంతో ఉండాలని బీజేపీ సూచించినట్టు చెబుతున్నారు.
కరూర్ తొక్కిసలాట సంక్షోభం అనంతరం విజయ్ భవిష్యత్ పొలిటికల్ ర్యాలీలపై అనిశ్చితి ఏర్పడింది. ఇది తన జీవితంలో ఎన్నడూ చూడని విషాదకర ఘటన అని, ఇది తనను ఎంతో బాధించిదనీ, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తనకు బాసటగా నిలిచిన రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని ఇటీవల విజయ్ ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు.


