
దేశ వ్యాప్తంగా మిన్నంటిన దీపావళి సంబరాలు..
దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. కాశ్మీర్ టు కన్యాకుమారి పండుగ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు, పిండి వంటల విందులతో జనం సందడి చేశారు. సాయంత్రం నుంచి టపాసుల సవ్వడి మొదలైంది. చిన్న పిల్లల దగ్గరి నుంచి ముసలి వారి వరకు టపాసులు పేల్చి సంతోషించారు. ఇక, దీపాల కాంతుల్లో ప్రతీ హిందూ గృహం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. అయోధ్యలో దీపావళి సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రామ మందిరం దీపాల కాంతుల్లో ధగధగలాడుతోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సందడి షూరు అయింది. హైదరాబాద్ మహానగరంలో ప్రజలైతే దీపావళి వేడుకను ధూమ్ ధామ్ గా జరుపుకుంటున్నారు. ఉదయం నుంచే షాపులు, ఇళ్లను వివిధ రకాల పూలు, విద్యుత్ దీపాలతో అలకరించారు. పిల్లలు, మహిళలు, కొత్త దుస్తులు ధరించి దేవాలయాలకు సందర్శించి.. ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఇక సాయంత్రం వేళ ఇళ్ల ముందు పిల్లలు, యువత క్రాకర్స్ కాలుస్తూ దీపావళి సంబరాలు జరుపుకుంటున్నారు.
సోమవారం నాడు హైదరాబాద్ నగరంలో దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి. వాడ వాడల్లో బాంబుల మోతలు మోగుతున్నాయి. సాయంత్ర వేళ దేవుళ్లకు దీపారాధనలు చేసిన అనంతరం నగర వాసులు అసలు కార్యక్రమాన్ని షూరు చేశారు. చిచ్చు బుడ్డులు, తారాజువ్వలు, పటాసులు, థౌజండ్ వాలాస్ వంటి అనేక రకాల బాంబులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇలా ఎంతో సరదాగా దీపావళి వేడుక జరుపుకుంటూ తమ జీవితాల్లో వెలుగు నింపాలని ప్రజలు కోరుకున్నారు. పలు చోట్ల అయితే పెద్ద సంఖ్యలో క్రాకర్స్ పేలుస్తూ యువతి, యువకులు తెగ ఎంజాయ్ చేశారు. ఇదే సమయంలో పెద్దలు దగ్గర ఉండి పిల్లల చేత టపాసులు కాలిపిస్తూ..సంతోషంగా గడుపుతున్నారు. డ్రోన్ , హెలికాప్టర్ట్, లాఫింగ్ బుద్దా వంటి వివిధ క్రాకర్స్ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.
సోమవారం సాయంత్రం 5 గంటలకు మొదలైన దీపావళి సందడి కొనసాగుతూనే ఉంది. దీపావళి కూకట్ పల్లి, జీడిమెట్ల, పంజాగుట్ట, ఎల్బీనగర్ , లింగపల్లి, మెహిదీపట్నం వంటి పలు ప్రాంతాల్లో ఈ దివాళి సందడి మరింత ఎక్కువగా కనిపించింది. మొత్తంగా నగరమంతా దీపావళి కాంతులతో వెలిగిపోతుంది. మరోవైపు దేశ ప్రధాని నరేంద్ర మోదీ మొదలు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలతో వెలుగు నిండాలని కోరుకున్నారు.
రామ భక్తులు సరయ నది ఒడ్డున లక్షలాది దీపాలను వెలిగించారు. దేశంలోని ప్రధాన హిందూ మందిరాల్లో సైతం దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జనం పెద్ద ఎత్తున గుళ్లకు వెళ్లి పూజలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి వేడుకల్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్‌లో పర్యటించారు. ఐఎన్ఎస్ విక్రాంత్ క్రూ మెంబర్స్‌తో కలిపి పండుగ జరుపుకున్నారు. వారికి స్వీట్లు సైతం పంచి పెట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
టాలీవుడ్ టు బాలీవుడ్ దీపావళి సంబరాలు
సామాన్యులే కాదు సినీ సెలెబ్రిటీలు కూడా దీపావళిని
ఎంతో అద్భుతంగా జరుపుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన దీపావళి సంబరాల్లో హీరో వెంకటేష్, నాగార్జున దంపతులు, నయన తార పాల్గొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే తన ఎక్స్ ఖాతాలో తెలియజేశారు. సంతోషం వ్యక్తం చేశారు. ఇక, బాలీవుడ్లో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ఇంట్లో దీపావళి సెలెబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకకు కరీనా కపూర్, కరిష్మా కపూర్, అలేఖ వాణి జైన్, నందనీ తాషా, అనీషా మల్హోత్రా జైన్, నీతూ కపూర్ వంటి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.


