
తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలకి ఆమోదం..
హైదరాబాద్ అక్టోబరు 16 (గోల్కొండ ):
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం మంత్రి మండలి సమావేశం ఏర్పాటు అయింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేబినెట్‌తో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు, రైతు భరోసా, మైనింగ్ కొత్త పాలసీ, మెట్రో ఫేజ్-2 టెండర్లపై చర్చించినట్లు సమాచారం. మెట్రో ఫేజ్-2పై సమావేశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే, కేబినెట్ భేటీకి మంత్రి కొండా సురేఖ హాజరు కాలేదు. తన ఇంటికి పోలీసులు రావడంపై ఆగ్రహంగా ఉన్నారు మంత్రి కొండా సురేఖ. ఈ నేపథ్యంలోనే కేబినెట్ భేటీకి రాకూడదని మంత్రి సురేఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బీసీ రిజర్వేషన్లపై చర్చ..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టులో వేసిన slp డిస్మిస్ కావడంతో తదుపరి కార్యాచరణపై కేబినెట్లో చర్చించారు. ఈ కేసును వాదించిన సీనియర్ న్యాయ వాదులు, న్యాయ నిపుణుల సలహాలు సూచనల మేరకు తదుపరి కార్యాచరణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల్లో న్యాయ నిపుణుల అభిప్రాయాలతో నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం రేవత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
కొత్త వ్యవసాయ కళాశాలలు
అలాగే, జయశంకర్ వర్సిటీకి మూడు కొత్త వ్యవసాయ కళాశాలలకు కేబినేట్ ఆమోదం తెలిపింది. వ్యవసాయ కళాశాలలు లేని ఉమ్మడి నల్లగొండ, నిజామాబాద్ వికారాబాద్ జిల్లాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు..
డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు మంత్రి మండలి నిర్ణయించింది. అలాగే,ఆర్ అండ్ బీ హ్యామ్ రోడ్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.10,500 కోట్లతో నిర్మించే 5500 కిలోమీటర్ల హ్యామ్ రోడ్లకు కేబినెట్ ఆమోదించింది. త్వరలో టెండర్లు పిలవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
కేబినెట్ కీలక నిర్ణయాలివే…
1. వానాకాలంలో 1.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది. దేశంలోనే ఇది రికార్డు స్థాయి ఉత్పత్తి. ఇందులో రాష్ట్రంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల విభాగం అంచనా వేసింది.
• కేంద్ర ప్రభుత్వం 50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు అంగీకరించింది. మరో 15 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది.
• వానకాలం సీజన్లో పండించిన ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.
• వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, పౌర సరఫరాల శాఖ, రవాణా శాఖ సమన్వయంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది.
• ధాన్యానికి చెల్లించే మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు ఇచ్చే రూ.500 బోనస్ రైతుల ఖాతాల్లో త్వరగా జమ చేయాలని నిర్ణయం తీసుకుంది.
• కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలని.. ప్రతి కొనుగోలు కేంద్రం పర్యవేక్షణ, సమన్వయానికి ఒక్కో అధికారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
2. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మూడు (3) అగ్రికల్చర్ కాలేజీల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. హుజూర్నగర్, కొడంగల్, నిజామాబాద్‌లో అగ్రికల్చర్ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
3. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఉత్సవాల నిర్వహణ.. సంబంధిత ఏర్పాట్లపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం.
4. ఇద్దరు పిల్లలకు మించి సంతానమున్న వారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులనే నిబంధనను మంత్రివర్గం పునరాలోచన చేసింది. రాష్ట్రంలో జనాభా నియంత్రణ కట్టుదిట్టంగా అమలవుతున్న తరుణంలో ఈ గరిష్ట నిబంధనను అమలు చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ సూచనప్రాయంగా అంగీకరించింది.
5. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఏన్కూర్ మార్కెట్ యార్డ్‌కు పది ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది.
6. నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయానికి ఇప్పుడున్న చోటనే అదనంగా 7 ఎకరాల భూమిని కేటాయించే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
7. నల్సార్ యూనివర్సిటీ అడ్మిషన్లలో ఇప్పుడు తెలంగాణ స్థానికులకు కేటాయించిన 25 శాతం సీట్ల కోటాను 50 శాతం పెంచాలని కేబినెట్ తీర్మానం చేసింది.
8. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మెట్రో 2A, 2B విస్తరణకు అడ్డంకిగా మారిన మొదటి దశను పీపీపీ మోడ్‌లో నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంపై సుదీర్ఘంగా కేబినెట్ చర్చించింది.
మెట్రో రైలును ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో సాధ్యాసాధ్యాలు, అందులో ముడిపడి ఉన్న అంశాలన్నింటినీ సమగ్ర అధ్యయనం చేసేందుకు ఉన్నత అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది.
తెలంగాణ ప్రభుత్వ సీఎస్ చైర్మన్‌గా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఏయూడీ కార్యదర్శి, లా సెక్రెటరీ, మెట్రో రైలు ఎండీ, అర్బన్ ట్రాన్స్పోర్ట్ అడ్వయిజర్ అధికారులు కమిటీలో సభ్యులుగా ఉంటారు.
అధికారుల కమిటీ తమ రిపోర్టును కేబినెట్ సబ్ కమిటీకి అందిస్తుంది. కేబినెట్ సబ్ కమిటీ సిఫారసుల ఆధారంగా మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం తీర్మానించింది.
9. తెలంగాణ రాష్ట్రంలో హ్యామ్ మోడ్‌లో మొదటి దశలో 5,566 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. జాతీయ రహదారులు, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానమయ్యే రహదారులకు సంబంధించి అభివృద్ధి, విస్తరణ పనులు చేపడుతూ కేబినెట్ నిర్ణయం.
10. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట ఓఆర్ఆర్, ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫాం రోడ్ వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సంబంధించి రక్షణ శాఖ భూములు వినియోగించుకుంటున్నందున వారికి ప్రత్యామ్నాయంగా 435.08 ఎకరాల భూములను అప్పగిస్తూ మంత్రి మండలి తీర్మానం చేసింది.
11. కృష్ణా – వికారాబాద్ బ్రాడ్‌గేజ్ రైలు మార్గం నిర్మాణానికి సంబంధించి 845 హైక్టార్ల భూ సేకరణకు అయ్యే రూ.438 కోట్ల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరిస్తూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది.
12. మన్ననూర్ – శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి మొత్తం వ్యయంలో మూడో వంతు రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరిస్తూ మంత్రి మండలి తీర్మానం చేసింది


