
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి సీఎం రేవంత్ …. షెడ్యూల్ ఇదే
హైదరాబాద్, అక్టోబరు 26 (గోల్కొండ ): జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో భారీ బహిరంగ సభ, నాలుగు రోడ్డు షోలకు రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈ నెల 28వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహణకు కాంగ్రెస్ హై కమాండ్ ప్రణాళిక రూపొందించింది. ఈ నెల 30, 31వ తేదీల్లో సీఎం రేవంత్‌రెడ్డి రోడ్డు షో నిర్వహించనున్నారు. నవంబర్ 4, 5వ తేదీల్లో మరో విడత రోడ్డు షోలో పాల్గొననున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
జూబ్లీహిల్స్‌లో రెండు విడతల్లో సీఎం రేవంత్‌రెడ్డి ర్యాలీలు ఉంటాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఢిల్లీ వేదికగా మీడియాతో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. తమ ప్రభుత్వంలో జూబ్లీహిల్స్‌లో 70 శాతం సంక్షేమ పథకాలు అందాయని ఉద్ఘాటించారు. బీజేపీ ఎంతసేపటికీ మతం పేరుతో ఓట్లు అడగటం తప్పా హైదరాబాద్ అబివృద్ధికి ఏం చేసిందని ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్ అభివృద్ధికి చేసింది ఏమి లేదని విమర్శించారు మహేష్ కుమార్ గౌడ్.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుస్తుందని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఏఐసీసీ దృష్టిలో తనతో సహా ఇతర నేతలు అందరూ ఉన్నట్లేనని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ హై కమాండ్ అన్ని విషయాలను చూస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ లాగా వ్యక్తుల జీవితాల్లోకి తాము తొంగి చూడమని తెలిపారు. మాగంటి గోపీనాథ్ కుటుంబం విషయం.. వారి వ్యక్తిగత అంశమని.. వాటితో తమకు సంబంధం ఏముందని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.


