భారీ వర్షాలు.. సీఎం కీలక ఆదేశాలు..

భారీ వర్షాలు.. సీఎం కీలక ఆదేశాలు..

హైదరాబాద్, ఆగస్టు 27  (గోల్కొండ ): రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. భారీ వర్షాలపై తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పురాత‌న ఇళ్ల‌లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించి.. సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని ఆదేశించారు. వినాయ‌క మండ‌పాల స‌మీపంలోని విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మ‌ర్లతో భ‌క్తుల‌కు ప్ర‌మాదం వాటిల్ల‌కుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ట్రాన్స్ కో సిబ్బందిని కోరారు. హైద‌రాబాద్‌లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్‌, అగ్నిమాప‌క‌, పోలీసు సిబ్బంది స‌మ‌న్వ‌యం చేసుకుంటూ.. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూడాల‌ని సూచించారు.న‌దులు, వాగులపై ఉన్న లోత‌ట్టు కాజ్‌వేలు, క‌ల్వ‌ర్టుల‌పై నుంచి నీటి ప్ర‌వాహాలు ఉంటే అక్క‌డ రాక‌ పోక‌లు నిషేధించాల‌ని సీఎం ఆదేశించారు. చెరువులు, కుంటలకు గండి ప‌డే ప్ర‌మాదం ఉన్నందున నీటి పారుద‌ల శాఖ అధికారులు ముందస్తు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం సూచించారు. అంటువ్యాధులు ప్ర‌బ‌లే ఆస్కారం ఉన్నందున న‌గ‌ర పాల‌క‌, పుర‌పాల‌క‌, గ్రామ పంచాయ‌తీ పారిశుద్ధ్య సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండి.. నిల్వ నీటిను తొలగించ‌డంతో పాటు ఎప్ప‌టి క‌ప్పుడు పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌న్నారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆసుప‌త్రుల్లో స‌రిప‌డా మందులు అందుబాటులో ఉంచుకోవ‌డంతో పాటు అవ‌స‌ర‌మైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల‌ని ఆ శాఖ ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!