
గోవుల అక్రమ రవాణా.. అడ్డుకున్న వ్యక్తిపై కత్తులతో దాడి
హైదరాబాద్ ఏప్రిల్ 08 (గోల్కొండ ):
గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంద మల్లమ్మ చౌరస్తా వద్ద ఈ సంఘటన జరిగింది. గోవులను అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందుకున్న ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి వాటిని అడ్డుకోవడానికి యత్నించాడు. ఈ క్రమంలో గోవుల వాహనం వెంట వచ్చిన మరో కారులోని గుర్తుతెలియని దుండగులు అతనిపై దాడి దిగారు.కత్తులు, కర్రలు, రాళ్లతో ప్రేమ్ కుమార్‌పై ఏడుగురు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో ప్రేమ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. వారి నుంచి తప్పించుకుని గాయాలతో బయటపడిన ప్రేమ్ కుమార్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. గోవుల అక్రమ రవాణా, దాడి ఘటనపై మీర్పేట్ పోలీస్‌స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాయపడ్డ ప్రేమ్ కుమార్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.


