
రాష్ట్రపతికి తప్పిన ప్రమాదం.
తిరువనంతపురం, అక్టోబర్ 22 (గోల్కొండ ) : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రమాదం తప్పింది. బుధవారం ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కేరళలో కొచ్చిలోని ప్రమదం స్టేడియంలో ల్యాండింగ్ అయింది. ఆ సమయంలో ఈ హెలికాఫ్టర్ ఒక వైపునకు భూమిలోకి కూరుకుపోయింది. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమైయ్యారు. వారంతా కలిసి ఒరిగిపోయిన హెలికాఫ్టర్‌ను సరి చేశారు. దీంతో భద్రతా సిబ్బంది సాయంతో ముర్ము.. హెలికాప్టర్ నుంచి కిందకి దిగారు. అయితే ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
నాలుగు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం కేరళ రాజధాని తిరువనంతపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో ఆమెకు గవర్నర్, సీఎంతోపాటు ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా శబరిమల, శివగిరిలోని దేవాలయాలను రాష్ట్రపతి ముర్ము సందర్శించుకోనున్నారు. అలాగే రాజ్‌భవన్‌లో మాజీ రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. పాలలో సెయింట్ థామస్ కళాశాల ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొంటారు. అదే విధంగా ఎర్నాకుళంలోని సెయింట్ ధెరిసా కళాశాల శతాబ్ది ఉత్సవాల్లో సైతం రాష్ట్రపతి పాల్గొనున్నారు.


