
రక్షణ రంగంలో ఆత్మనిర్భర భారత్కు ఆపరేషన్ సింధూర్ ఒక ప్రతీక…రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ, ఆగస్టు 14 (గోల్కొండ ): రక్షణ రంగంలో ఆత్మనిర్భర భారత్కు ఆపరేషన్ సింధూర్ ఒక ప్రతీక అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శుక్రవారం 79వ భారత స్వాతంత్ర దినోత్సవం. ఈ సందర్భంగా గురువారం న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించారు. ఉగ్రవాద దాడి అనంతరం భారత్ ఐక్యతతో స్పందించిందన్నారు. దేశాన్ని విభజించే శక్తులపై భారత్ ప్రతిస్పందనకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. దేశ పౌరుల రక్షణ కోసం.. ప్రతీకారం తీర్చుకోవడానికి మనం ఏ మాత్రం వెనుకాడబోమనేందుకు ఇది నిదర్శనమని స్పష్టం చేశారు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రపంచం గుర్తించిందని చెప్పారు. అందుకు ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం సరైన మార్గంలోనే వెళ్లామన్నారు.ఇక పెహల్గాం ఉగ్రదాడిని పిరికిపంద చర్య, పూర్తిగా అమానుషమని ఆమె అభివర్ణించారు. గణతంత్ర, స్వాతంత్ర దినోత్సవాలను దేశంలోని ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం జీడీపీ వృద్ధి రేటుతో భారత్.. ప్రపంచంలోనే ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని ముర్ము తెలిపారు.


