
మద్యం దుకాణాలకు..నేటి నుంచే దరఖాస్తులు..
హైదరాబాద్ సెప్టెంబర్ 26 (గోల్కొండ ):
నోటిఫికేషన్ విడుదల.. అక్టోబరు 18 వరకు దరఖాస్తులు
ఫీజు రూ.3 లక్షలకు పెంపు.. 23న లాటరీతో కేటాయింపు
2025 డిసెంబరు 1 – 2027 నవంబరు 30 దాకా కాలవ్యవధి
దుకాణాల్లో గౌడ్లకు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం కోటా
రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణకోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025 డిసెంబరు 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు రెండేళ్ల వ్యవధికి సంబంధించి మద్యం దుకాణాల అనుమతుల కోసం మార్గదర్శకాలను ఆబ్కారీ శాఖ గురువారం జారీ చేసింది. మద్యం దుకాణాలకు శుక్రవారం నుంచి అక్టోబరు 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆ నెల 23న లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయిస్తారు. ప్రభుత్వం మొత్తం 2,620 మద్యం దుకాణాలకుగాను.. 15శాతం దుకాణాలను గౌడ సామాజిక వర్గానికి, 10శాతం ఎస్సీలకు, 5శాతం ఎస్టీలకు రిజర్వు చేసింది. ఈసారి దరఖాస్తు రుసుమును రూ.3 లక్షలుగా నిర్ణయించింది. ప్రస్తుతం కొనసాగుతున్న 2,620 దుకాణాల గడువు నవంబరు 30తో ముగుస్తుంది. డిసెంబరు 1 నుంచి కొత్త దుకాణాల నిర్వహణ మొదలవుతుంది.
మద్యం దుకాణాలకు లైసెన్సు ఫీజు ఇలా..
2011 జనాభాలెక్కల ప్రకారం 5వేల వరకు జనాభా ఉన్నప్రాంతంలో దుకాణానికి రూ.50 లక్షలు.. 5వేల నుంచి 50 వేల జనాభా ఉన్న చోట రూ.55 లక్షలు.. 50వేల నుంచి లక్షలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.60 లక్షలు లైసెన్సు ఫీజు చెల్లించాలి. లక్ష నుంచి 5 లక్షల జనాభా ఉండే ప్రాంతాల్లో రూ.65 లక్షలు, 5లక్షల నుంచి 20 లక్షల జనాభా ఉండే ప్రాంతాల్లో రూ.85 లక్షలు, 20లక్షలపైన జనాభా ఉండే ప్రాంతాల్లో రూ.కోటీ 10 లక్షలు వార్షిక ఫీజుగా చెల్లించాలి. జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు.. జిల్లాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాల నిర్వహణకు అనుమతిస్తారు. దుకాణాల రిజర్వేషన్‌కు సంబంధించి కుల ధ్రువీకరణ పత్రాన్ని దరఖాస్తుకు జత చేయాలి. అందుబాటులో లేని వారు స్వీయ పూచీకత్తు కింద దరఖాస్తు చేసుకోవచ్చు.


