
పెట్రోల్ బంకులో ఫేక్ కరెన్సీ.. అడ్డంగా దొరికిపోయిన ముఠా
మంచిర్యాల ఏప్రిల్ 03 (గోల్కొండ ):ఫేక్ కరెన్సీని నిర్మూలించాలని పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వాటి చలామణి మాత్రం ఆగడం లేదు. కొత్తకొత్త ప్లాన్లు వేస్తూ పోలీసులనే బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా దొంగనోట్లు చలామణి చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు ఓ ముఠా సభ్యులు. వారి గుట్టురట్టు చేసి కటకటాల వెనక్కి పంపారు పోలీసులు. నిందితుల నుంచి లక్షల రూపాయల ఫేక్ నోట్లు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు.మంచిర్యాల జిల్లాలో దొంగ నోట్ల వ్యవహారం కలకలం రేపింది. ఫేక్ నోట్లు చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 25న ఓ పెట్రోల్ బంకులో మూడు రూ.500 నోట్లు ఇచ్చారు ముఠా సభ్యులు. నోట్లపై ఒకే సీరియల్ నంబర్ ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు బంక్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. తీగ పట్టుకుని లాగగా డొంక మెుత్తం కదిలింది. ప్రధాన సూత్రధారి కానుగంటి క్రాంతి సహా 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు.నిందితుల నుంచి రూ.5,98,500లు స్వాధీనం చేసుకున్నారు. 12 సెల్ ఫోన్లు, మూడు వాహనాలు సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడలో తెలిసిన పరిచయాల ద్వారా ఫేక్ నోట్లను కేటుగాళ్లు చలామణి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈజీ మనీ కోసమే ఫేక్ కరెన్సీని చలామణి చేస్తున్నట్లు విచారణలో తేలింది. వారందరినీ అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.


