
861 ఎకరాల స్వాధీనం.. అక్రమాలపై హైడ్రా ఉక్కుపాదం
హైదరాబాద్ ఏప్రిల్ 12 (గోల్కొండ ): అవి ప్రభుత్వ భూములు! వివాదాస్పదం చేశారు! యథాతథస్థితిని కొనసాగించాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది! అయినా.. ఫాంహౌజ్‌లు కట్టుకున్నారు! ఐదారంతస్తుల భవనాలు నిర్మించి.. అమ్మేశారు! లే అవుట్లు చేసి.. ప్లాట్లు అమ్మేశారు! రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో నోటరీ పేరిట విక్రయించేశారు! ఈ అక్రమాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో శనివారం భారీ ఆపరేషన్ నిర్వహించి 861 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూ.15 వేల కోట్లు ఉంటుందని అంచనా. గత పదేళ్ల నుంచి ఐలాపూర్ గ్రామ పరిధిలో అనధికారికంగా నిర్మించిన భారీ భవనాలను, ఇండ్లను, బహుళ అంతస్తుల భవనాలను ధ్వంసం చేసింది. శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కూల్చివేతల ప్రక్రియ రాత్రి వరకూ కొనసాగింది. ఈ భారీ ఆపరేషన్‌లో హైడ్రాతోపాటు పోలీసు, రెవెన్యూ, జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.
ఐలాపూర్‌లోని సర్ఫేఖాస్ భూములపై నాలుగు దశాబ్దాలుగా వివాదం నెలకొంది. ఇక్కడ 1 నుంచి 220 సర్వే నంబర్ల వరకు 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. రికార్డుల్లో ఇది నిజాం పాలకులకు చెందినదిగా ఉంది. విలీన ప్రక్రియ ప్రకారం ప్రభుత్వ భూమిగా రికార్డులకు ఎక్కింది. 2003లో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం అప్పటి జాయింట్ కలెక్టర్ ఈ 1263 ఎకరాలను ప్రభుత్వ భూమిగా ప్రకటించారు. అయినా, ఈ భూములపై హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. వీటిని ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ హైడ్రా పలు నిర్మాణాలకు రెవెన్యూ ద్వారా ఇటీవల నోటీసులు కూడా జారీ చేసింది. భారీ ఎక్స్కవేటర్లు, బుల్డోజర్లు, పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి శనివారం ఉదయం కూల్చివేతలను ప్రారంభించింది. ‘‘ఐలాపూర్ సర్వే నంబరు 1 నుంచి 220 వరకూ ఉన్న ప్రభుత్వ భూమిలో ఎలాంటి కట్టడాలు చేయరాదని 1998లో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దాని ని ఏమాత్రం లెక్కచేయకుండా 2006లో ఎంఏ ముఖీం గెస్ట్‌హౌజ్ కట్టాడు. దానితోపాటు 40 ఎకరాల పరిధిలో ఫాంహౌజ్ నిర్మించాడు. చుట్టూ ఫెన్సింగ్ వేసి హద్దులు పెట్టాడు. అటువైపు కన్నెత్తి చూడడానికి కూడా అవకాశం లేకుండా కాపలా పెట్టాడు. అక్కడితో ఆగకుండా ఆ భూములను తెగనమ్మడం ప్రారంభించాడు. దాంతో, అక్కడ లే అవుట్లు ఉన్నవారు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ఆ భూముల స్వరూపాన్ని మార్చరాదని ఇరు పక్షాలకూ 2013లో హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. హైకోర్టు ఉత్తర్వులను కూడా పట్టించుకోకుండా 2.20 ఎకరాల్లో ముఖీం సోదరుడు ఎంఏ అజీం ఆరంతస్తుల అపార్టుమెంటును నిర్మించాడు. ఆ అపార్టుమెంటును హైడ్రా కూల్చివేసింది. స్విమ్మింగ్ పూల్ సహా విలాసవంతంగా నిర్మించుకున్న గెస్టుహౌజ్తోపాటు అక్కడ నిర్మించిన ఇంటిని; ఇంటి చుట్టూ 40 ఎకరాల మేర గడీలు పెట్టి నిర్మించుకున్న ఫాంహౌజ్‌ను; గుర్రాల కోసం నిర్మించిన శాలలను తొలగించింది’’ అని హైడ్రా తన ట్విటర్ హ్యాండిల్లో పెట్టిన ప్రకటనలో పేర్కొంది. ఇక్కడ ఎంఏ ముఖీం న్యాయవాది బీఆర్ఎస్ నాయకు డు కాగా.. స్వయానా ఆయన తమ్ముడు ఎంఏ ఫహీం కాంగ్రెస్ నాయకుడు. ప్రస్తుతం రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ కూడా. ముఖీం సోదరులు ఇక్కడ పాతికేళ్ల కిందటే ఫాంహౌజ్ కట్టుకున్నారు. దాని చుట్టుపక్కల దాదాపు 40 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు.
కోర్టు తీర్పులు పెండింగ్‌లో ఉండగా ఆ భూమితో ఎటువంటి సంబంధంలేని ముఖీం, అతని అనుచరులు ఇష్టానుసారం అమ్మకాలు చేస్తుండడాన్ని ప్రభుత్వం సీరియ్‌సగా పరిగణించిందని హైడ్రా ఆ ప్రకటనలో పేర్కొంది. కోర్టు ఉత్తర్వులను ఏమాత్రం లెక్కచేయకుం డా, ప్లాట్లుగా అమ్మేస్తున్న వారికి ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి చెక్ పెట్టిందని తెలిపింది. ‘‘చట్టాలంటే భయం లేకుండా, అధికారులను లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా కబ్జాలు చేసి అక్కడ లావాదేవీలు నిర్వహిస్తున్న ముఖీం కార్యకలాపాలకు ఫుల్స్టాప్ పెట్టింది. ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ముఖీంకు చెక్ పెట్టింది’’ అని ఆ ప్రకటనలో హైడ్రా పేర్కొంది. స్వాధీనం చేసుకున్న 861 ఎకరాలకు ఫెన్సింగ్ వేయనున్నట్లు తెలిపింది. ఇక, ఐలాపూర్, ఐలాపూర్ తండా గ్రామాల్లో పెద్ద ఎత్తున భూముల్లో పక్కా భవనాలను నిర్మించుకున్నారు. కూల్చివేతల నేపథ్యంలో అమీన్‌పూ ర్, ఐలాపూర్, కిష్టారెడ్డిపేట గ్రామాల్లో తీవ్ర ఆందోళన లు నెలకొన్నాయి. అయితే, ఇప్పటికే ఇళ్లు కట్టుకుని ఉన్న వారిని మినహాయించి, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఇల్లు కట్టుకున్న పేదలు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఎప్పటికప్పుడు మైకు లో అధికారులు ప్రకటించారు. దాంతో, పేదలంతా ఊపిరి పీల్చుకున్నారు. హైడ్రాకు సహకరించారు. మరోవైపు, బీరంగూడ, కిష్టారెడ్డిపేట రహదారిపై అసైన్డ్ భూములను లీజులకు ఇచ్చి అద్దెలు వసూలు చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపారు. లీజు స్థలాల్లో వేసిన షెడ్లను, దుకాణాలను ఖాళీ చేయించారు. పలు నిర్మాణాలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా చిరు వ్యాపారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఉన్నపళంగా ఖాళీ చేయాలంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వేడుకున్నారు. సామగ్రి తీసుకునే సమయం ఇ వ్వాలని ప్రాథేయపడ్డారు. దాంతో, గంట, రెండు గంట ల్లో ఖాళీ చేసి వెళ్లిపోవాలని అధికారులు స్పష్టం చేశారు. అలాగే, కిష్టారెడ్డిపేట గ్రామ సర్వే నంబర్ వేసి ఐలాపూర్ గ్రామ భూముల్లో ముఖీం సోదరుడు అజీం ఆరంతస్తుల భవనం నిర్మించి కొందరికి విక్రయించారని అధికారులు ఆరోపిస్తున్నారు. సదరు భవనాన్ని హైడ్రా కూల్చివేసేందుకు వెళ్లగా బాదితులు అడ్డుకుని హైడ్రా అధికారులతో వాగ్వాదానికి దిగారు. సామగ్రి ఖాళీ చేసి తీసుకుని వెళ్లేందుకు రెండు గంటల సమ యం ఇవ్వడంతో కొందరు బయటకు తెచ్చి కుప్పగా పోసుకున్నారు. మధ్యాహ్నం తరువాత కూల్చివేతలపై హైకోర్టు విధించిన స్టే కాపీ అందడంతో కూల్చివేతలకు హైడ్రా తాత్కలికంగా బ్రేక్ వేసింది.


