
మహమ్మద్ ప్రవక్త సూచించిన బాటలో ప్రతి ఒక్కరు నడవాలి
కరీంనగర్ ,సెప్టెంబర్ 02 (గోల్కొండ ):
మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్తు మానవజాతికి అనుసరణీయమని, ప్రవక్త గౌరవం యావత్తు ముస్లిం లందరికీ ప్రాణం కంటే విలువైనదని, మహమ్మద్ ప్రవక్త సూచించిన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని జమాతే ఇస్లామి హింద్ జిల్లా అధ్యక్షుడు సూహైబ్ అహ్మద్ ఖాన్ అన్నారు. మంగళవారం రబిఉల్ అవ్వల్ మాసం సందర్భంగా మహమ్మద్ ప్రవక్త జన్మదిన మాసోత్సవాల సందర్భంగా నగరంలోని ఎంఐఎం పార్టీ కార్యాలయం దారుస్సలాంలో ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ అధ్యక్షతన జల్సా సిరతున్నబి ఆధ్యాత్మిక సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జమాతే ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షుడు సోహైబ్ అహ్మద్ ఖాన్, మంకమ్మ తోట ఏరియా అధ్యక్షుడు మహమ్మద్ ఖైరుద్దీన్ లు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ఆధ్యాత్మిక సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ వారసత్వంగా మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని భవిష్యత్తు తరాలకు చెప్పాల్సిన బాధ్యత ప్రతి ముస్లింపై ఉన్నదని చెప్పారు. నేటి కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ యుగంలో యువత, విద్యార్థులు పెడదారిన పట్టకుండా, చెడు వ్యసనాల బారిన పడకుండా మహమ్మద్ ప్రవక్త జీవిత సూత్రాలు చెప్పారని, వాటిని కుల, మతాలకు అతీతంగా తెలియజేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందన్నారు. ఈ జన్మ దిన మాసరోత్సవాల సందర్భంగా కరీంనగర్ జిల్లాలో ఒక లక్ష మందిని కుల మతాలకతీతంగా కలిసి మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రను ఆయన జీవితంలో చేసినటువంటి మంచి కార్యక్రమాలను యావత్తు సమాజానికి తెలియపరచి వారిని చైతన్యవంతులుగా చేయడమే జమాతే ఇస్లామీ హింద్ ముఖ్య ఉద్దేశమని ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలా కేంద్రాలలో, మేజర్ గ్రామపంచాయతీలలో, మున్సిపల్ ఏరియాలలో కలియతిరిగి మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రను యావత్తు మానవులందరికీ వివరిస్తామని చెప్పారు. ఎవరు అంగీకరించినా, అంగీకరించక పోయినా మహమ్మద్ ప్రవక్త కేవలం ముస్లింలకే ప్రవక్త కాదని, యావత్తు మానవులందరి కోసం ఏకేశ్వరుడైన అల్లాహ్ పంపించిన ప్రవక్త అని వివరించారు. సెప్టెంబర్ 19, 20, 21తేదీలలో నగరంలోని మహాత్మా జ్యోతిబాపూలే మైదానము సర్కస్ గ్రౌండ్లో మహమ్మద్ ప్రవక్త జన్మదిన మాస ఉత్సవాలకు సంబంధించి ఎక్స్ పో- 2025ను నిర్వహిస్తున్నట్లు ఇందులో వివిధ స్టాళ్లను ఏర్పాటు చేసి ప్రవక్త జీవిత చరిత్ర కు సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచుతామన్నారు. చివరి రోజు 21న సుమారు వేలాది మందితో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఆధ్యాత్మిక బహిరంగ సభకు జమాతే ఇస్లామీ హింద్ జాతీయ అధ్యక్షునితోపాటు, రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.


