
బర్దమాన్ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. పలువురికి గాయాలు…
కోల్‌కతా అక్టోబరు 12 (గోల్కొండ ) : పశ్చిమబెంగాల్ లోని బర్దమాన్ రైల్వే స్టేషన్ లో ఆదివారం సాయంత్రం తొక్కిసలాట చోటుచేసుకుంది. పండుగ సీజన్ కావడంతో రద్దీ ఎక్కువగా ఉండటం, 4,5,6 ఫ్లాట్‌ఫామ్‌ల పైకి ఒకేసారి 3 నుంచి 4 రైళ్లు రావడంతో ప్రయాణికులు పరుగులు తీశారు. రైల్వే బ్రిడ్జిపై పరుగులు తీయడం, మెట్లు ఇరుకుగా ఉండటంతో గందరగోళం చెలరేగిందని, పలువురు ప్రయాణికులు కిందకు దొర్లిపడటంతో గాయపడ్డారని తెలుస్తోంది. హల్దీబరి ఇతర ప్రాంతాలకు వెళ్లే రైళ్లను అందుకునేందుకు ప్రయాణికులు పరుగులు పెట్టడం గందరగోళానికి దారితీసిందని ప్రత్యక్ష సాక్షలు తెలిపారు.
తొక్కిసలాటలో 10 నుంచి 15 మంది ప్రయాణికులు గాయపడటంతో వారిని హుటాహుటిన బర్ధమాన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురు మహిళలు పలువురు పురుషులు ఉన్నారు. రైల్వే వైద్యులు ఘటన స్థలిలోనే ఫస్ట్ ఎయిడ్ అందించి తదుపరి చికిత్స కోసం వారిని ఆసుపత్రికి పంపించారు. కాగా, బాగా గాయపడిన వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.
బాధితులను పరామర్శించేదుకు పలువురు రాజకీయ నేతలు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. రైల్వే భద్రతా చర్యలపై ఆందోళన వ్యక్తం చేశారు.తొక్కిసలాట కారణంగా రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం కలిగింది. ఆ తర్వాత తిరిగి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు


