నా అభ్యర్థిత్వానికి ఎసరు పెట్టాలనుకున్నారు.. బీజేపీపై మమత తీవ్రారోపణ

నా అభ్యర్థిత్వానికి ఎసరు పెట్టాలనుకున్నారు.. బీజేపీపై మమత తీవ్రారోపణ

కోల్‌కతా ఏప్రిల్ 11 (గోల్కొండ ): ఎన్నికల కమిషన్‌తో బీజేపీ కుమ్మక్కై భవనాపూర్ నుంచి తన అభ్యర్థిత్వాన్ని చెల్లకుండా చేసేందుకు ప్రయత్నించినట్టు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. పశ్చిమ మేదినిపూర్ జిల్లాలోని కేషియారిలో శనివారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ, తనపై తప్పుడు కేసులు బనాయించడం ద్వారా భవనాపూర్ నుంచి తన అభ్యర్థిత్వాన్ని చెల్లకుండా చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని అన్నారు. అయితే ఆ పార్టీ గేమ్ ప్లాన్‌ను టీఎంసీ కార్యకర్తలు, ప్రజలు భగ్నం చేశారని తెలిపారు. భవనాపూర్‌లో మమతా బెనర్జీపై బీజేపీ అభ్యర్థిగా సువేందు అధికారి పోటీలో ఉన్నారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సమయంలో 90 లక్షల మంది పేర్లను బీజేపీ బలవంతంగా తొలగించిందని మమతా బెనర్జీ ఈ సందర్భంగా ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు గెలవలేక తప్పుడు మార్గాల ద్వారా ఓట్లను రాబట్టుకునేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఆ కారణంగానే లక్షలాది ఓటర్లను వాళ్లు తొలగించారని, ఫలితాలు తమకు అనుకూలంగా ఉండేలా ఈవీఎంల ట్యాంపరింగ్‌ చేసే ఆలోచనలో కూడా ఉన్నారని అన్నారు.
‘ఎస్ఐఆర్ ప్రక్రియ కారణంగా 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తొలగించిన 90 లక్షల మంది ఓటర్లలో 60 లక్షల మంది హిందువులు, 30 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. బెంగాలీ మాట్లాడినంత మాత్రమే మనం భారతీయులం కాదా? నిరంతరం పౌరసత్వం నిరూపించుకోవాలా?’ అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలు చేస్తామంటూ బీజేపీ ఎన్నికల హామీపై మాట్లాడుతూ, ఈ చర్యను వెనుకబడిన వర్గాలపై నేరుగా దాడి చేసేందుకు, ప్రజల ప్రజాస్వామ్య హక్కులను కొల్లగొట్టేందుకు జరుపుతున్న దాడిగా ఆమె పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్‌లో యూసీసీని అమలు చేసేది లేదన్నారు. రాష్ట్రంలో వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చి.. ఢిల్లీలో బీజేపీకి ఉద్వాసన పలుకుతామని, ఆ వెంటనే యూసీసీని రద్దు చేస్తామని మమత స్పష్టం చేశారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!