
కొండారెడ్డిపల్లి దసరా వేడుకలలో పాల్గొన్న సీఎం రేవంత్
నాగర్ కర్నూల్ అక్టోబర్ 02 (గోల్కొండ ):
దసరా ఉత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి.. తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో గురువారం ఘనం జరుపుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూర్ మండలం కొండారెడ్డపల్లికి హెలికాప్టర్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతోపాటు గ్రామస్తులు గజమాలతో స్వాగతం పలికి.. ఆయనపై పూల వర్షం కురిపించారు. అనంతరం ఆ గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామి వారిని దర్శించుకుని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత తమ నివాసానికి ఆయన చేరుకున్నారు.
సాయంత్రం గ్రామంలోని దసరా ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక కట్టమైసమ్మ దేవాలయంలో ఆయన పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులతో కలిసి జమ్మిచెట్టు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు స్వగ్రామంలో దసరా ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారని సమాచారం అందడంతో
ఆ పరిసర గ్రామాల ప్రజలంతా కొండారెడ్డి పల్లెకు భారీగా తరలి వచ్చారు. దీంతో ఆ గ్రామం జనసంద్రంగా మారింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కొండారెడ్డి పల్లెలో భారీగా పోలీసులను మోహరించారు.


