
కాంగ్రెస్ హయాంలో ఇష్టారాజ్యంగా కబ్జాలు చేస్తున్నారు: ఎంపీ రఘునందన్ రావు
సంగారెడ్డి ఏప్రిల్ 09 (గోల్కొండ ):కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా కబ్జాలు చేస్తున్నారని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కూడా ప్రభుత్వ భూములను కబ్జా చేశారని విమర్శించారు. గురువారం పటాన్‌చెరు పట్టణ కేంద్రంలో జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. సర్వే నంబర్ 428లో 2 ఎకరాల 18 గుంటల స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. జాతీయ రహదారుల విస్తరణ ప్రజాసంక్షేమం కోసం మాత్రమే కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని చెప్పుకొచ్చారు.కబ్జాదారులకు, జాతీయ రహదారి విస్తరణ పనులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాల తరగతి గదులను రాత్రికి రాత్రి కూలగొట్టడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వ పాఠశాల కాంపౌండ్ వాల్ బయటనే జాతీయ రహదారి విస్తరణ చేయాల్సి ఉండగా .. పాఠశాల తరగతి గదులను కూల్చివేయటంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు ఈ విషయమై స్పందించి పాఠశాల గదులను కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాల కూల్చివేతలపై అధికారులు సీరియస్‌గా చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఎంపీ పేర్కొన్నారు.


