
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుపడిన సాఫ్ట్వేర్లు..
హైదరాబాద్ ఏప్రిల్ 03 (గోల్కొండ ) : మహానగరంలో డ్రగ్స్ వినియోగం మరోసారి కలకలం రేపింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధి కొండాపూర్ ‘క్వేక్ అరినా పబ్’పై టాస్క్ ఫోర్స్ ఈగల్ టీమ్, సైబరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. అంతర్జాతీయ డీజే ‘బ్లాక్ కాఫీ’ ఈవెంట్ సందర్భంగా ప్రత్యేక పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడులు చేశారు. డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు వచ్చిన ముందస్తు సమాచారం ఆధారంగా ఆరు ప్రత్యేక బృందాలతో సోదాలు చేసినట్లు ఈగట్ టీమ్ అధికారులు తెలిపారు.పార్టీకి హాజరైన 64 మందికి పరీక్షలు నిర్వహించగా.. వారిలో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందన్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ఈగల్ టీమ్ అధికారులు వెల్లడించారు. దాడుల అనంతరం అందరికీ ఏబాన్ డ్రగ్ పరీక్ష కిట్లను ఉపయోగించి పరీక్షలు చేసినట్లు తెలిపారు. నిందితుల్లో నలుగురు గంజాయి, బెంజోడియాజెపైన్ వాడినట్లు తేలింది. అలాగే మరో నలుగురు గంజాయి, మెథాంఫేటమిన్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో 8 మందిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు. వారిపై గచ్చిబౌలి పోలీసులు ఎన్డీపీఎస్- 1985 సెక్షన్ 8(సి), 27(ఎ), 27(బి)ల కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
డ్రగ్స్ తీసుకున్న వారిలో వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్లు, కాంట్రాక్టర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు స్పెయిన్‌కు చెందిన కళాకారులూ ఈ పార్టీలో పాల్గొన్నట్లు తెలిపారు. అలెగ్జాండర్, క్వేక్ ఎరీనా డీజే కేవీలకు డ్రగ్ పరీక్షలు చేయగా.. నెగటివ్ వచ్చినట్లు వెల్లడించారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే 1908 లేదా 8712671111 నంబర్లకు కాల్ చేసి తెలియజేయాలని ఈగల్ ఫోర్స్ విజ్ఞప్తి చేసింది.


