ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి

హైదరాబాద్, ఏప్రిల్ 08 (గోల్కొండ):

వనస్థలిపురం ప్రాంతంలో ఇవాళ(బుధవారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి.. కారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ, నడుచుకుంటూ వెళ్ళిపోతున్న వ్యక్తిని, అలాగే బైక్ పై వెళ్లిన ఇద్దరు యువకులను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో హోండా సిటీ కారు.. సుమారు 100 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లి పల్టీ కొట్టింది.

ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరణించిన వారు శివ, సందీప్ జోహెల్ అనే యువకులుగా పోలీసులు గుర్తించారు. అలానే పాదాచారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మృతిచెందిన యువకులు మహావీర్ ఇంజినీరింగ్ కాలేజ్ లో ఈసీఈ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న తోటి విద్యార్థులు, కాలేజీకి చెందిన వారు రోడ్డుపై ఆందోళన చేపట్టారు.

ప్రమాదానికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రమాదం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!