
ఇరాన్‌కు మంచి రోజులు.. అమెరికా సహాయం చేస్తుంది: డొనాల్డ్ ట్రంప్
ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 08 (గోల్కొండ ):ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం ప్రపంచ శాంతికి ఒక గొప్ప రోజు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. గత 40 రోజులుగా అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి రెండు వారాల పాటు ఉపశమనం లభించింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ గురించి స్పందించారు. హోర్ముజ్ మార్గంలో నౌకాయానాన్ని సులభతరం చేయడానికి అమెరికా సహాయం చేస్తుందని తెలిపారు .ఈ యుద్ధం ఆగిపోవాలని ప్రపంచం మొత్తం కోరుకుంటోంది. ఇరాన్‌కు ఇక చాలు అనిపించింది. పశ్చిమాసియాలో సువర్ణాధ్యాయం మొదలు కాబోతోంది. హోర్ముజ్ మార్గంలో నౌకాయానాన్ని సులభతరం చేయడానికి అమెరికా సహాయం చేస్తుంది. సానుకూల చర్యలు చేపట్టి వాణిజ్యపరంగా ముందడుగు వేయడానికి ఇరాన్‌కు ఇది సువర్ణావకాశం. ఇరాన్ తమ దేశాన్ని పునర్నిర్మించుకునే పనిని మొదలుపెట్టవచ్చు. అమెరికా తప్పకుండా సహాయం చేస్తుంది. మా దేశం లాగానే ఇరాన్‌కు కూడా మంచి రోజులు రాబోతున్నాయి’ అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా, కాల్పుల విరమణపై అమెరికాకు మద్దతు ఇవ్వబోతున్నట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు పేర్కొన్నారు . అయితే ఈ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదని స్పష్టం చేశారు. తాజాగా దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దళాలు దాడులు చేశాయి. అమెరికాకు ఇరాన్ ప్రతిపాదించిన పది పాయింట్ల అజెండాలో లెబనాన్‌పై దాడులను ఆపాలని కూడా ఉంది. అయినప్పటికీ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడం గమనార్హం.


