
ఆసియా కప్ ఫైనల్లో భారత్..
దుబాయ్: వరుస విజయాలతో జోరు మీదున్న భారత్.. ఆసియా కప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అభిషేక్ శర్మ (37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75) ధనాధన్ అర్ధ శతకంతోపాటు బౌలర్లు రాణించడంతో.. బుధవారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. తొలుత భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 168/6 స్కోరు చేసింది. హార్దిక్ పాండ్యా (38), శుభ్‌మన్ గిల్ (29) రాణించారు. రిషద్ హుస్సేన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో బంగ్లా 19.3 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. సైఫ్ హసన్ (69), పర్వేజ్ హొస్సేన్ ఇమాన్ (21) మినహా మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. కుల్దీప్ మూడు.. బుమ్రా, వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు దక్కించుకొన్నారు. అభిషేక్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. సూపర్-4లో నాలుగు పాయింట్లతో టీమిండియా తొలి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించింది. గురువారం పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్‌తో రెండో బెర్త్ ఎవరికి దక్కుతుందో తేలుతుంది. లిట్టన్ దాస్ వెన్నునొప్పితో బాధపడుతుండడంతో జాకెర్ అలీ బంగ్లా తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు.
బౌలర్ల దెబ్బకు విలవిలా..
సైఫ్ ఒంటరి పోరాటం చేసినా.. టీమిండియా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంతో బంగ్లా ఏదశలోనూ మ్యాచ్‌లోకి రాలేకపోయింది. రెండో ఓవర్లో ఓపెనర్ తన్జిద్ హసన్ (1)ను అవుట్ చేసిన బుమ్రా.. ఆరంభంలోనే బంగ్లాను దెబ్బకొట్టాడు. దీంతో సైఫ్, పర్వేజ్ ఆచితూచి ఆడడంతో స్కోరు బోర్డు మందకొడిగా కదిలింది. అయితే, నాలుగో ఓవర్లో వరుణ్ బౌలింగ్‌లో రెండు వరుస బౌండ్రీలతో దూకుడు పెంచిన పర్వేజ్.. ఆ తర్వాతి ఓవర్లో బుమ్రా బౌలింగ్‌లో సిక్స్ బాదాడు. దీంతో ఆరు ఓవర్లకు బంగ్లా 44/1తో నిలిచింది. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు కుల్దీప్, అక్షర్ పరుగులను కట్టడి చేస్తూ బంగ్లా బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తున్న పర్వేజ్‌ను అవుట్ చేసిన కుల్దీప్.. రెండో వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. మరోవైపు సైఫ్ వీలు చిక్కినప్పుడల్లా షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును నడిపించాడు. కాగా, 10వ ఓవర్లో తన బౌలింగ్‌లో సిక్స్ బాదిన హ్రిదయ్ (7)ను అక్షర్ అదే ఓవర్లో క్యాచౌట్ చేశాడు. ఆ తర్వాత షమీమ్ (0)ను వరుణ్ బౌల్డ్ చేయడంతో.. బంగ్లా 74/4తో ఇబ్బందుల్లో పడినట్టు కనిపించింది. జాకెర్ అలీ (4)ని సూర్య రనౌట్ చేశాడు. మరోవైపు అక్షర్ వేసిన 14వ ఓవర్లో రెండు సిక్స్‌లతో అర్ధ శతకం పూర్తి చేసుకొన్న సైఫ్.. జట్టు స్కోరును సెంచరీ దాటించాడు. బంగ్లా విజయానికి చివరి 5 ఓవర్లలో 61 పరుగులు కావల్సి ఉండగా.. సైఫుద్దీన్ (4)ను వరుణ్ వెనక్కిపంపాడు. 17వ ఓవర్లో రిషద్ (2), తన్జిమ్ హసన్ (0)ను కుల్దీప్ వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చగా.. సైఫ్‌ను బుమ్రా అవుట్ చేయడంతో బంగ్లా పోరాటం ముగిసింది.


