
ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశానికి హాజరైన ప్రణవ్..
హుజురాబాద్ నియోజకవర్గంలోనే మొట్ట మొదటి ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం
కరీంనగర్ ఆగస్టు 14 (గోల్కొండ ):
పదేళ్ల నిరీక్షణ తర్వాత సొంతింటి కల నెరవేరడంతో లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం వెళ్లివిరుస్తుందని,కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు నిజమైన లబ్ధి చేకూరుతుందని దానికి నిదర్శనం ఇందిరమ్మ ఇళ్లు అని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ అన్నారు.గురువారం నాడు నియోజకవర్గంలోనే మొట్ట మొదటి సారిగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం శ్రీరాములపేట గ్రామంలో పైలెట్ ప్రాజెక్ట్ గా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుడు దేవునూరి రాజేందర్ గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సొంతిల్లు నిర్మించుకోవడానికి కృషి చేసిందని,దీనికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి,మంత్రులు,నియోజకవర్గ ఇంచార్జీ ప్రణవ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ నియోజకవర్గంలోనే మొట్ట మొదటి గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరవ్వడం సంతోషంగా ఉందని,మంజూరు అయిన ఇళ్లు దాదాపు పూర్తి కావస్తున్నాయని,పదేళ్లలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యలేదని,ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే ముగ్గు పోసి నేడు గృహ ప్రవేశ కార్యక్రమం జరుగుతుందని ఇది పనిచేసే ప్రజాప్రభుత్వమని అన్నారు.ఇందిరమ్మ ఇళ్ళతో పాటు రానున్న రోజుల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా మంజూరు చేస్తామని వాటి ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని నియోజకవర్గానికి ఇచ్చిన 3500 ఇళ్లతో పాటు,అదనంగా మరో వెయ్యి ఇళ్లు కూడా గుంట భూమి లేని నిరుపేదలకు మంజూరు చేస్తామని అన్నారు.రేషన్ కార్డులు,సన్న బియ్యం,మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం,రైతు భరోసా,బోనస్,రుణమాఫీ చేసి చూపించామని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులూ గంగాడి తిరుపతి రెడ్డి ,నల్లకొండల్ రెడ్డి, మహిపాల్ రెడ్డి సాహేబహుస్సేన్ ,రషీద్,శ్రీపతి రెడ్డి , సునీల్ ,కార్యకర్తలు పాల్గొన్నారు.


