
మన్యంకొండలో వైభవంగా అగ్నిగుండం
సాంప్రదాయ రీతిలో వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు
-భక్తులకు అలంకరణలో దర్శనమిచ్చిన వీరభద్ర స్వామి వారు
దేవరకద్ర, సెప్టెంబర్ 16 (గోల్కొండ)
మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రధాన దేవాలయమైన మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుబంధ దేవాలయం, దేవస్థానం క్షేత్రపాలకుడు శ్రీ వీరభద్ర స్వామి ఉత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతి ఏడాది స్వామివారి ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఆవరణలో అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమాన్ని సాంప్రదాయ రీతిలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ అగ్నిగుండంలో అగ్గి కీలలపై నడిచి భక్తులు తమ భక్తిని చాటుకున్నారు.స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు సోమవారం రాత్రి దేవాలయ ఆవరణలో నందికొళ్ల సేవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. విశేష దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చకులు పూజలు నిర్వహించారు. అలాగే స్వామివారిని వివిధ రకరకాల పూలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దీంతో స్వామివారు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్, వంశపారంపర్య ధర్మకర్త అళహరి మధుసూదన్ కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, ప్రత్యేక పూజలు రాజేష్, నరసింహయ్య, పాలక మండల సభ్యులు, పర్యవేక్షకుడు నిత్యానంద చారిలతో పాటు దేవస్థానం సిబ్బంది, పురోహితులు, వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


