
పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తే లీగల్ నోటీసులు ఇస్తాం: మంత్రి సీతక్క
భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 10 (గోల్కొండ ):
అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని స్త్రీ శిశు సంక్షేమ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క అన్నారు. అంగన్వాడీ అంటే అమ్మఒడి అంటూ సీతక్క అభివర్ణించారు. మినీ అంగన్వాడీలను కాంగ్రెస్ ప్రభుత్వం అప్ గ్రేడ్ చేసిందని.. ఆ టీచర్లకు ఇప్పుడు రూ.2 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్లు కూడా ఇస్తున్నామని పేర్కొన్నారు. అంగన్వాడీలకు గతంలో సెలవలు కూడా ఉండేవి కాదని.. కాంగ్రెస్ సర్కార్లో వారికి సెలవులు ఇస్తున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు.
అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీకి దక్కుతుందని ప్రశంసించారు. మహిళా శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో అంగన్వాడీ టీచర్లకు మంత్రి సీతక్క స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. స్మార్ట్ ఫోన్లు పంపిణీ సందర్భంగా తనపై వస్తున్న ఆరోపణలను సీతక్క ఖండించారు. తనపై కొంతమంది పిచ్చి వాగుడు వాగుతున్నారని ఆగ్రహించారు. అసత్య ప్రచారాలతో అబద్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సెల్ ఫోన్ల కొనుగోలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆన్ లైన్ టెండర్లు వేసిందని.. ఎక్కడా అవినీతి జరగలేదన్నారు. కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్ల ద్వారా మాత్రమే రూ.11,600 తక్కువ రేటుతో సెల్ ఫోన్లు ఇస్తున్నామని పేర్కొన్నారు.
తమ ప్రభుత్వం ఫోన్లు కొన్నది రూ.11 వేలకే అయితే రూ.14 వేలకు కొన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు సీతక్క. పేదలకు మంచి చేసే తమ లాంటి వాళ్ల మీద చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న వారికి లీగల్ నోటీసులు ఇస్తామని మంత్రి హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పని చేసినా గత ప్రభుత్వ పాలకులకు నిద్రపట్టడం లేదని విమర్శించారు. నిజాలు ఉంటే నిరూపించాలని, అంతేగాని బట్ట కాల్చి మీద వేస్తామంటే ఉరుకునే పరిస్థితి లేదని మంత్రి సీతక్క హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, అంగన్వాడీలు పాల్గొన్నారు.


