
ఒరాకిల్ను టార్గెట్ చేసిన ఇరాన్…..లేఆఫ్స్ వేళ ఊహించని షాక్
ఇంటర్నెట్ డెస్క్ (గోల్కొండ ) : ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం 35వ రోజుకు చేరుకుంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు చేస్తున్నాయి. తాజాగా, ఇరాన్‌లోని అతి పెద్ద స్టీల్ ప్లాంట్లపై రెండు దేశాలు దాడులు చేశాయి. ఈ దాడులకు ప్రతీకారంగా యూఏఈ, బహ్రెయిన్, ఇజ్రాయెల్ దేశాలపై ఇరాన్ గురువారం దాడులు చేసింది. శుక్రవారం తెల్లవారుజామున కూడా దాడులు చేసింది. ది మిలటరీ సెంట్రల్ కమాండ్, ఖతమ్ అల్ అన్బియలు ఈ దాడులపై స్టేట్ టీవీలో ఓ ప్రకటన చేశాయి.అబుదాబిలోని అమెరికన్ స్టీల్ ఇండస్ట్రీస్, బహ్రెయిన్‌లోని అమెరికన్ అల్యూమినియం ఇండస్ట్రీస్, జియోనిస్ట్ ప్రభుత్వంలోని రాఫెల్ ఆర్మ్స్ ఫ్యాక్టరీలపై దాడులు చేశామని తెలిపాయి. తస్నిమ్ న్యూస్ మీడియాతో రెవల్యూషనరీ గార్డ్స్ నేవీ కమాండ్ మాట్లాడుతూ.. అమెరికాకు చెందిన రెండు డేటా సెంటర్లపై అతి త్వరలో దాడులు చేయబోతున్నామని ప్రకటించారు. దుబాయ్‌లోని ఒరాకిల్ డేటా సెంటర్, బహ్రెయిన్‌లోని అమెజాన్ డేటా సెంటర్ తమ తదుపరి టార్గెట్ అని ఆయన చెప్పుకొచ్చారు.
లేఆఫ్స్ వేళ ఊహించని షాక్..
ఒరాకిల్ కంపెనీ తాజాగా భారీ సంఖ్యలో లేఆఫ్స్ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 30 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఒక్క ఇండియాలోనే 12 వేల ఉద్యోగాలు పోయాయని సమాచారం. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో ఉద్యోగాలు తీసేస్తున్నట్లు ఉద్యోగులకు మెయిల్స్ వెళ్లాయి. ఇకపై స్వచ్ఛందంగా తమ ఉద్యోగాలకు రాజీనామా చేసే వారికి మంచి పరిహారం అందిస్తామని కూడా ఒరాకిల్ కంపెనీ ప్రకటించింది. లేఆఫ్స్‌తో ఉద్యోగులకు షాక్ ఇస్తున్న ఒరాకిల్‌కు ఇరాన్ షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. దుబాయ్‌లోని డేటా సెంటర్‌పై దాడులు చేస్తామని ప్రకటించింది.


