
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని వెనక్కి తీసుకోవాలి…
ఢిల్లీ అక్టోబర్ 05 (గోల్కొండ ):
భారతదేశం అనే ఇంటిలోని ఒక గది ‘పాక్ ఆక్రమిత కశ్మీర్’ అని మోహన్ భగవత్ అన్నారు. ఇంట్లోని గదిని ఎవరో ఆక్రమిస్తే దానిని మనం వెనక్కి తీసుకోవాలని, మనది అవిభక్త భారతదేశమని గుర్తుంచుకోవాలని అన్నారు.పాకిస్థాన్ పాలకుల అణిచివేతపై పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ప్రజలు తిరగబడటం, ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఛీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు.మధ్యప్రదేశ్లో సాత్నాలో సింధీ క్యాంప్ గురుద్వారా ప్రారంభోత్సవంలో మోహన్ భగవత్ ఆదివారంనాడు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనని మనం భిన్నంగా పిలుచుకుంటున్నప్పటికీ నిజం ఏమిటంటే మనమంతా ఒకటేనని, మనమంతా హిందువులమేనని అన్నారు. ‘చాలా మంది సింధీ సోదరులు ఇక్కడున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్లు పాకిస్థాన్ వెళ్లలేదు. వాళ్లు అవిభక్త భారతదేశానికి వెళ్లారు. పరిస్థితులు మనని ఇక్కడి నుంచి ఆ ఇంటికి పంపాయి. ఎందుకంటే ఆ ఇల్లూ, ఈ ఇల్లూ వేరుకావు. ఇండియా మొత్తం ఒకే ఇల్లు. నా ఇంట్లో టేబులు, కుర్చీ, బట్టలు ఉంచుకునే గదిని ఒకరు తొలగించారు. దాన్ని ఆక్రమించుకున్నారు. రేపు, వాటిని నేను వెనక్కి తీసుకోవాలి’ అని మోహన్ భగవత్ అన్నప్పుడు సభలో హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి.


