
దేశం గర్వించదగిన గిరిజన నేత… శిబుసోరెన్
జార్ఖండ్ ఆగస్టు 16 (గోల్కొండ ):
దేశం గర్వించదగిన గిరిజన నేత, దిషోం గురు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబుసోరెన్ అని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు.శనివారం శిబుసోరెన్ స్వంత గ్రామం జార్ఖండ్ రామ్‌గఢ్ జిల్లాలోని నమ్రాలో సంప్రదాయ గిరిజన ఆచారాలతో నిర్వహించిన దిషోం గురు శ్రద్ధాంజలి కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు.
ఈ సందర్భంగా శిబుసోరెన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వారి సేవలను స్మరించుకున్నారు. శిబు సోరెన్ జార్ఖండ్ కు మాత్రమే కాకుండా దేశంలోని గిరిజన, అణగారిన వర్గాల పక్షాన బలమైన స్వరం వినిపించారని, వారి జీవితం ఆ వర్గాల కోసం అంకితం చేశారని కొనియాడారు. గిరిజన సమాజ ప్రయోజనాల కోసం శిబుసోరెన్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ సందర్భంగా శిబు సోరెన్ కుమారుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా సంతాపాన్ని ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.వీరి వెంట పలువురు ఎంపీ లు ఉన్నారు.


